జార్ఖండ్‌లో అమిత్‌ షా అయోధ్య అస్త్రం..

రాంచీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. జార్ఖండ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభిస్తూ అయోధ్య, కశ్మీర్‌ అంశాలను హైలైట్‌ చేశారు. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. అయోధ్యపై సుప్రీం కోర్టులో కేసు విచారణ నిరంతరాయంగా జరగకుండా ఉండేలా కాంగ్రెస్‌ ప్రయత్నించిందని విమర్శించారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించేందుకు మార్గం సుగమం చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును వెల్లడించిందని చెప్పుకొచ్చారు. అయోధ్యలో వివాదాస్పద భూమిపై ఆరు దశాబ్ధాలుగా న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉన్న కేసుపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ 40 రోజుల పాటు నిర్విరామంగా విచారణ చేపట్టి చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, జార్ఖండ్‌లో ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 20 వరకూ ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.